టిడ్కో ఇళ్లు రాని వారికి డబ్బు వాపస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • టిడ్కో ఇళ్లు కేటాయించని 83 వేల మందికి డబ్బు వాపస్
  • రూ.174 కోట్లు తిరిగి చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
  • నిర్మాణం పూర్తయిన లక్ష టిడ్కో ఇళ్లకు త్వరలో గృహప్రవేశాలు
  • రాష్ట్రంలో మరో 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయం
  • పట్టణాల్లో ఇళ్లకు క్యూఆర్ కోడ్‌తో డోర్ నంబర్లు
గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసి, ఫ్లాట్లు కేటాయింపు జరగని లబ్ధిదారులకు ఊరట కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 83,865 మందికి వారు చెల్లించిన దరఖాస్తు సొమ్ము రూ.174 కోట్లను తిరిగి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించాలని సూచించారు.

బుధవారం అమరావతిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ డోర్ నంబర్ కేటాయించాలని, తాగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు స్మార్ట్ వాటర్ పైప్‌లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు మరో 70 అన్న క్యాంటీన్లను త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటి నిర్వహణ కోసం రాజస్థాన్, తమిళనాడులోని మోడళ్లను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 204 క్యాంటీన్లకు ఏటా రూ.167 కోట్లు ఖర్చవుతోందని అధికారులు వివరించగా, దాతలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ క్యాంటీన్లను నడిపేలా చూడాలన్నారు.

పురమిత్ర యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వల్ల కలుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని, ఎమ్మెల్యే క్వార్టర్లను త్వరలో పరిశీలిస్తానని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
TIDCO houses
Andhra Pradesh
housing scheme
municipal development
Anna Canteens
Amaravati
urban development
QR code
smart water pipeline

More Telugu News